మంగళవారం, జూన్ 09, 2015

శ్రద్ధాంజలి : దాశరధి రంగాచార్య







       "అపౌరుషేయాలకి అక్షర రూపమా..!?" అంటూ చాలామంది ఆశ్చర్య పడిపోయారుట  , దాశరధి వేదాలను తెలుగులోనికి అనువదించడానికి పూనుకున్నప్పుడు.  కొందరు ఛాందసులు రుసరుసలాడిపోతే, చాలామంది సంస్కరణభిలాషులు వెన్నుతట్టి ముందుకు నడిపించి ప్రోత్సహించారుట. ఆ విధంగా ఇరవయ్యో శతాబ్దం  ప్రారంభానికి కొంచెం ముందు వేదామృతం తెలుగులోనికి అనువదించబడి సామాన్యులకి అందుబాటులోనికి వచ్చింది.  క్లిష్టమైన సంసృతంలోనుంచి సామాన్యతెలుగు భాషలోనికి వేదాలను అనువదించడం ద్వారా దాశరధి “అభినవ వ్యాసుని”గా కీర్తి గడించారు. 

       “నా తెలంగాణా కోటిరతనాల వీణ” అంటూ నినదించిన ప్రఖ్యాత సాహితీవేత్త దాశరధి కృష్ణమాచార్య తమ్ముడు ఈ రంగాచార్య. చెరగని చిరునవ్వుతో అతిసామాన్యంగా కనిపించే ప్రసన్న వదనం దాశరధిది. సాత్వికంగా మాట్లాడుతూనే అవసరం వచ్చినప్పుడు కుండబద్దలుకొట్టినట్లు తన అభిప్రాయలను వెల్లడించడం దాశరధికే చెల్లింది. సాంప్రదాయ శ్రీవైష్ణవ కుటుంబంలోపుట్టి ఒక చేత్తో రామాయణాన్నీ మరొకచేత్తో కారల్ మార్క్సుని పట్టుకుని తిరిగారు.   వేదాలను తెనుగించిన ఆచేతితోనే నిజాంకాలంలో రజాకార్లుగా పేరుగాంచి ప్రజలను హింసించిన ముష్కరుల అకృత్యాలను "చిల్లర దేవుళ్ళు","మోదుగపూలు" నవలలలో కళ్ళకు కట్టినట్లు వివరించారు. తెలుగులో ఎంత సాధికారికంగా మాట్లాడగలరో అంతే సాధికారికంగా ఉర్దూలోకూడా ప్రసంగించగలరు దాశరధి . “మా నిజాం రాజు, తరతరాల బూజు” అంటూ ఆగ్రహించారు. సూటిగా నిక్కచ్చిగా ఉండే భావాలతో మాట్లాడే రంగాచార్య ప్రత్యేక తెలంగాణాని కోరుకుంటూనే అది నాయకులకి కాక ప్రజలకి ఉపయోగపడే తెలంగాణా కావాలని అభిలషించారు. "జీవనయానం" పేరిట తనజీవిత చరిత్రను అక్షరబద్ధం చేసిన దాశరధి స్వర్గస్థులు కావడంతో తెలుగు సాహితీ లోకంలో ఒక అధ్యాయానికి తెరపడింది.